Archive for the ‘బామ్మ బ్లాగాయణం’ Category

అమృతతుల్యమైన ఆదివారం
April 30, 2012
మాఘమాసం లో శుక్లపక్షం లో వచ్చే సప్తమి
January 30, 2012రధ సప్తమి

” సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా-సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి”
అనే శ్లోకాన్ని పఠిస్తూ తల స్నానం చేసారా?
చిక్కుడు ఆకులతో రధాన్ని చేసారా?
అన్నం పరవాన్నం/ చక్కెర పొంగలి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టారా?
ఆదిత్య హృదయం చదివారా?
మాఘమాసం లో శుక్లపక్షం లో వచ్చే సప్తమి ఈ రోజు(30-01-12)రధ సప్తమి. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని పూజిస్తాం ఈ రోజున. సూర్యుడు తన రధాన్ని ఉత్తరాయణ దిశగా మళ్ళించే రోజైన ఈ రోజున రధ సప్తమిగా మహా భారత కాలం నుండీ జరుపుకుంటున్నామని పెద్దల మాట. ఈ రోజే సూర్య భగవానుడి జన్మదినం అనీ మరో సంగతీ పురాణాలు చెబుతున్నాయి. ఎదేమైనా ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించడం వెనుక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయర్రా!. ఉదయాన్నే వచ్చే సూర్యుడి కిరణాల్లో మన ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా ఉంటాయట. అంతే కాదు ఉదయాన్న వచ్చే ఆ లేత సూర్యకిరణాలు పలు చర్మ వ్యాధులకూ మందు అనీ అంటారు. అన్నట్టు ఈ రోజున కొన్ని చోట్ల కోదమండ్ర అనీ, కోడళ్ళ పండుగా అనీ వ్యవహారం లో ఉందర్రా! దీని గురించి పెద్దగా విషయాలేమీ తెలీవు నాకు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.
ఈ రోజుకు ముందు రోజు అంటె మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి, సప్తమి రోజు ఉదయాన్నే మాఘ స్నానం చేస్తే మంచిదనీ మా అమ్మ చెప్పేదర్రా! అప్పట్లో, నదులూ, వాగుల పక్కనా ఊళ్ళుండేవి కాబట్టి అలా మాఘ స్నానమని నదీ స్నానానికి వెళ్ళేవారేమో!
నదీ స్నానం చేసే ముందు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద పెట్టుకుని తీసుకు వెళ్ళి సూర్యోదయ సమయాన ఆ దీపాన్ని నది లో వదిలి స్నానం చేస్తామని మా అమ్మమ్మ చెప్పింది. అన్నట్టు ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది. వీలైతే చూడండి. ( కాలుష్యం నిండిన మన పట్టణాల్లో, ఎటు చూసినా బిల్డింగులే దర్శనమిచ్చే మన పరిసరాల్లో….. ఆకాశం …నక్షత్రాలు ఎన్నడొ మర్చిపోయాం కదూ!)
అన్నట్టు ఈ రోజు సప్తమి కదూ…. సప్త…. అంటే ఏడు కి చాలా విశిష్టత ఉందర్రా! ఆకాశం లో ఇంద్రధనుస్సు రంగులు ఏడు, సూర్యభగవానుడి రధానికి అశ్వాలు ఏడు, సంగీతాలు స్వరాలు ఏడూ(సప్త స్వరాలు), మనకి సప్త వారాలు,( ఏడు రోజులు)సప్త ద్వీపాలు, సప్త ఋషులు,సప్త గిరులు సంగతి తెలిసిందే( ఏడు కొండలవాడు),సప్త సముద్రాలు, సప్త లోకాలు,అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి ఎడు ముఖ్యమైనవి అని చెబుతారు. ఆ ఏడింటి పేర్లు తెలుసునా!
- మొదటి కిరణం- సుషుమ్నం
- రెండవ కిరణం- హరి కేశు
- మూడవ కిరణం- విశ్వ కర్మ
- నాల్గవ కిరణం- విశ్వ వ్యచ
- ఐదవ కిరణం- సంపద్వసు
- ఆరవ కిరణం- అర్వాదము
- ఏడవ కిరణం- స్వరాడ్వసు
ఇవీ ఆ ఏడు కిరణాల పేర్లు. అది సరే కానీ, ఈ రోజున పాలు పొంగించి, నేతి తో తడిపిన బియ్యాన్ని ఆ పాలల్లో ఉడికించి పరవాన్నం సుర్యభగవానుడికి నివేదన చెయ్యాలర్రా! అలా చేసినవాళ్ళు తరిగిన కూర తినకూడదని శాస్త్రం చెబుతొంది. ఈ కాలం లో దొరికే చిక్కుడు కాయలు ఒలిచి కూర చేసుకుని తింటే మంచి బి విటమిన్ అందుతుంది అనీ మరో రకంగా శాస్త్రం చెప్పిందన్నమాట.
అన్నట్టూ మన దేశం లో ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవానుడికి బోల్డన్ని ఆలయాలు ఉన్నాయి. అదేమిటీ, కోణార్క్, అరసవెల్లి ఈ రెండేగా అంటారా, కానే కాదు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఉదాహరణకి కాశ్మీర్ లోని మార్తాండ్ లోనూ, గుజరాత్ లో మొఢేరా అనీ ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించీ మరోసారి చెప్పుకుందాం కానీ , ఇవాళా ఏం చేసినా చెయ్యకపోయినా ఓ సారి ఆదిత్య హృదయం చదవండి.

ఆసక్తికరమైన ఓ వెబ్ సైట్
January 23, 2012ఇవాళ అలా ఓ సారి అంతర్జాలం తెరవగానే ఓ విషయం కంట పడిందరా! ఆ వివరాలు రాసేసాను. ఇదిగో మీరూ చదవండి.
మధుమేహం ఉన్నవారికై ఓ వెబ్ సైట్
ఇఫ్ యు కెన్ మెజర్ ఇట్ యు కెన్ మెనేజ్ ఇట్—–అనే ఓ సూక్తి ఆధారంగా మధుమేహం తో బాధ పడే వారు ఎప్పటికప్పుడు దానిని పర్యవేక్షిస్తుంటే నిశ్చింతగా ఉండొచ్చనే దిశలో కేర్ లాగర్ అనే ఓ వెబ్ సైట్ ఉందర్రా!
సాధారణం గా ఆన్ లైన్ లో డైరీ రాసుకునే సదుపాయం ఉండే పలు వెబ్ సైట్ లు దర్శనమిస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనించడానికి వీలైన ఓ వెబ్ సైట్ వచ్చింది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వారు తీసుకుంటున్న మందుల వివరాలు, వారి బరువు, తీసుకునే ఆహారం వంటి విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఆ వివరాలను ప్రపంచం లో ఎక్కడి నుంచైనా వీక్షించే సదుపాయం కల్పిస్తొంది కేర్ లాగర్ డాట్ కామ్. ఈ వివరాలను తమ తమ డాక్టర్లతో నూ పంచుకోవచ్చు. అమెరికాలో ఎక్కువగా మధుమేహ వ్యాధి బారిన పడిన వారు ఉంటుంటారు. వారి కోసమై ఈ వెబ్ సైట్ రూపొందినా అందరూ వారి ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఆ వివరాలతో గ్రాఫ్ లూ చార్ట్ లు రూపొందించుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు ఎప్పటికప్పుడు వారి శారీరక ఆరోగ్య వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది, వారికి ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ వెబ్ సైట్ లో ఇ మెయిల్ అడ్రస్ ఇచ్చి ఉచితంగా నమోదు చేసుకుని శారీరక ఆరోగ్య వివరాలను పొందు పరచు కోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్ చూడండి. https://carelogger.com

మన పండుగలు – పర్వదినాలు
January 17, 2012ఈ నెల నుంచీ మన పండుగలు ప్రత్యేక పర్వదినాల గురించీ మీ అందరికీ తెలియచెయ్యాలన్న ఆలోచన వచ్చిందర్రా! ఆలోచన వస్తేచాలా, ఆచరణలో పెట్టొద్దూ!!! ఆలోచన వచ్చింది ఆంగ్ల సంవత్సరాదిరోజైనా ఇన్నాళ్ళకి ఆచరణ సాధ్యమయ్యింది. సరే ఇవిగో ఇక్కడ జనవరి లో ప్రత్యేకతలను తేదీల వారిగా ఇచ్చాను. వాటిల్లో కొన్నిటికి వివరణలూ ఉన్నాయ్. మరి కొన్నిటికి త్వరలోనే చెప్తాను.
. ఇక ఆలస్యం దేనికి, చదవండి, మీ పిల్లలకి చెప్పండి.
జనవరి
1- ఆంగ్ల సంవత్సరాది
5-ముక్కోటి ఏకాదశి
6-కూర్మ ద్వాదశి
7-శని త్రయోదశి
12- సంకట హర చతుర్ధి
14- భొగి
15- మకర సంక్రాంతి
ఉత్తరాయణం
16- కనుమ
17- ముక్కనుమ
21- శని త్రయోదశి
శని త్రయోదశి శని కి చాలా ఇష్టం. ఇది చాలా విశిష్టమైన రోజనీ, శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు అని శాస్త్రం చెబుతోందర్రా.
23- చొల్లంగి అమావాస్య , నాగోబా జాతర, తెప్పతిరునాళ్లు
చొల్లంగి అమావాస్య
పుష్య మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి ఎంతోమంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండప్రదానం చేయడం, చొల్లంగిలో వెలసిన స్వామి వారిని అర్చించడం జరుగుతుంది.
తెప్పతిరునాళ్లు
పుష్య బహుళ అమావాస్య అయిన ఈ రోజు, సింహాచలం కొండ దిగువ భాగంలో ని అడవివరంలో గల ఉద్యానవనం, పుష్కరణి ప్రాంతాల్లో సింహాచల అప్పన్న కు ప్రత్యేక పూజలతో పాటు తెప్పతిరునాళ్లు వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.
నాగోబా జాతర
పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజున, గిరిజనులు నాగోబా జాతరను ఎంతో సంబరంగా జరుపుకుంటారు.ఈ రోజు వారి ఆరాధ్య దైవమైన ‘నాగోబా’ పురివిప్పి నాట్యంచేస్తాడని వారి నమ్మకం. ‘నాగోబా’ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఉంది. మనరాష్ట్రం నుంచే కాకుండా పక్కరాష్ట్రాలనుంచీ లక్షలాదిమంది గిరిజనులు ఈగ్రామానికి చేరుకుని నాగోబా జాతరలో పాల్గొంటారు. ఈ జాతరకు ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉంది.
ఈ జాతరకు 16 రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబా ఆలయం నుంచి కలశం తీసుకుని గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి వెళతారు.కేస్లాపూర్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుకు వరకు నడిచి వెళ్ళి గోదావరి జలం తీసుకు వస్తారు. ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చాడనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు భావిస్తుంటారు. ఇక్కడ సేకరించిన జలంతో నిండిన కలశాన్ని నలభై కిలోమీటర్ల దూరంలోని ‘పూసినగూడ’ గ్రామానికి లేదా ప్రధాన పూజారి ఉండే నార్నూరు మండలం గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కేస్లాపూర్‌కు 8కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి అక్కడ వెలసిన ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుతారు. అక్కడి నుంచి బయలుదేరి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి 10కి.మీ. దూరంలోని సిరికొండ చేరుకుంటారు. పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రిచెట్టు దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం ప్రక్కన ఉన్న పూజామందిరం మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగ దేవతను అభిషేకిస్తారు. గిరిజన తెగకు చెందిన మెస్రిం వంశస్తులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా ఈ జాతరకు హాజరై నాగదేవతను పూజిస్తుంటారు.
26- గణతంత్ర దినోత్సవం
28- శ్రీ పంచమి
30- రధ సప్తమి
31- భీష్మాష్టమి

శ్రావణ మాసం విశేషాలు
August 10, 2010చాంద్రమానం ప్రకారం అయిదవ మాసం శ్రావణ మాసం. పెళ్ళిళ్ళు వ్రతాలు నోములు లాంటి వివిధ విశేషాలతో నిండుగా ఉండే మాసం ఇది. శ్రీ మహా విష్ణువుకు ,శ్రీ మహా లక్ష్మి కీ ఎంతో ప్రీతికరమైన రోజులు ఇవి . ఈ మాసం లో మంగళ,శుక్ర,శని వారాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మంగళ వారాలు మంగళ గౌరీ వ్రతం,రెండవ శుక్రవారం నాడు అంటే శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రాఖీ అలగే స్వతంత్ర్య దినోత్సవం ఇవే కాదు ఇంకా చాలా విశేషాలు ఈ మాసం లో ఉన్నాయి.శ్రావణం లో తప్పనిసరిగా శనివారాలు శ్రీ మహా విష్ణువు ను పూజిస్తారు. అన్నట్టు ఈ సారి ఇంగ్లీషు నెలల ప్రకారం ఆగష్టు 11 నుండీ శ్రావణ మాసం ప్రారంభం.మరిన్ని విశేషాలు రేపు చెబుతానర్రా!.

శ్రావణం వచ్చేసింది!
August 10, 2010శ్రావణ లక్ష్మి వచ్చేసిందర్రా! ఇక పండగలే పండగలు.నోములు వ్రతాలు ఒహటేమిటి చెప్పుకోడానికి చాలా ఉన్నై. మరి ఈ మాస విశిష్టత, పండుగలు గురించి రాస్తాను, వస్తూ ఉండండే!




