
మాఘమాసం లో శుక్లపక్షం లో వచ్చే సప్తమి
January 30, 2012రధ సప్తమి

” సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా-సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి”
అనే శ్లోకాన్ని పఠిస్తూ తల స్నానం చేసారా?
చిక్కుడు ఆకులతో రధాన్ని చేసారా?
అన్నం పరవాన్నం/ చక్కెర పొంగలి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టారా?
ఆదిత్య హృదయం చదివారా?
మాఘమాసం లో శుక్లపక్షం లో వచ్చే సప్తమి ఈ రోజు(30-01-12)రధ సప్తమి. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని పూజిస్తాం ఈ రోజున. సూర్యుడు తన రధాన్ని ఉత్తరాయణ దిశగా మళ్ళించే రోజైన ఈ రోజున రధ సప్తమిగా మహా భారత కాలం నుండీ జరుపుకుంటున్నామని పెద్దల మాట. ఈ రోజే సూర్య భగవానుడి జన్మదినం అనీ మరో సంగతీ పురాణాలు చెబుతున్నాయి. ఎదేమైనా ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించడం వెనుక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయర్రా!. ఉదయాన్నే వచ్చే సూర్యుడి కిరణాల్లో మన ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా ఉంటాయట. అంతే కాదు ఉదయాన్న వచ్చే ఆ లేత సూర్యకిరణాలు పలు చర్మ వ్యాధులకూ మందు అనీ అంటారు. అన్నట్టు ఈ రోజున కొన్ని చోట్ల కోదమండ్ర అనీ, కోడళ్ళ పండుగా అనీ వ్యవహారం లో ఉందర్రా! దీని గురించి పెద్దగా విషయాలేమీ తెలీవు నాకు. మీకేమైనా తెలిస్తే చెప్పండి.
ఈ రోజుకు ముందు రోజు అంటె మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి, సప్తమి రోజు ఉదయాన్నే మాఘ స్నానం చేస్తే మంచిదనీ మా అమ్మ చెప్పేదర్రా! అప్పట్లో, నదులూ, వాగుల పక్కనా ఊళ్ళుండేవి కాబట్టి అలా మాఘ స్నానమని నదీ స్నానానికి వెళ్ళేవారేమో!
నదీ స్నానం చేసే ముందు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద పెట్టుకుని తీసుకు వెళ్ళి సూర్యోదయ సమయాన ఆ దీపాన్ని నది లో వదిలి స్నానం చేస్తామని మా అమ్మమ్మ చెప్పింది. అన్నట్టు ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది. వీలైతే చూడండి. ( కాలుష్యం నిండిన మన పట్టణాల్లో, ఎటు చూసినా బిల్డింగులే దర్శనమిచ్చే మన పరిసరాల్లో….. ఆకాశం …నక్షత్రాలు ఎన్నడొ మర్చిపోయాం కదూ!)
అన్నట్టు ఈ రోజు సప్తమి కదూ…. సప్త…. అంటే ఏడు కి చాలా విశిష్టత ఉందర్రా! ఆకాశం లో ఇంద్రధనుస్సు రంగులు ఏడు, సూర్యభగవానుడి రధానికి అశ్వాలు ఏడు, సంగీతాలు స్వరాలు ఏడూ(సప్త స్వరాలు), మనకి సప్త వారాలు,( ఏడు రోజులు)సప్త ద్వీపాలు, సప్త ఋషులు,సప్త గిరులు సంగతి తెలిసిందే( ఏడు కొండలవాడు),సప్త సముద్రాలు, సప్త లోకాలు,అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి ఎడు ముఖ్యమైనవి అని చెబుతారు. ఆ ఏడింటి పేర్లు తెలుసునా!
- మొదటి కిరణం- సుషుమ్నం
- రెండవ కిరణం- హరి కేశు
- మూడవ కిరణం- విశ్వ కర్మ
- నాల్గవ కిరణం- విశ్వ వ్యచ
- ఐదవ కిరణం- సంపద్వసు
- ఆరవ కిరణం- అర్వాదము
- ఏడవ కిరణం- స్వరాడ్వసు
ఇవీ ఆ ఏడు కిరణాల పేర్లు. అది సరే కానీ, ఈ రోజున పాలు పొంగించి, నేతి తో తడిపిన బియ్యాన్ని ఆ పాలల్లో ఉడికించి పరవాన్నం సుర్యభగవానుడికి నివేదన చెయ్యాలర్రా! అలా చేసినవాళ్ళు తరిగిన కూర తినకూడదని శాస్త్రం చెబుతొంది. ఈ కాలం లో దొరికే చిక్కుడు కాయలు ఒలిచి కూర చేసుకుని తింటే మంచి బి విటమిన్ అందుతుంది అనీ మరో రకంగా శాస్త్రం చెప్పిందన్నమాట.
అన్నట్టూ మన దేశం లో ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవానుడికి బోల్డన్ని ఆలయాలు ఉన్నాయి. అదేమిటీ, కోణార్క్, అరసవెల్లి ఈ రెండేగా అంటారా, కానే కాదు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఉదాహరణకి కాశ్మీర్ లోని మార్తాండ్ లోనూ, గుజరాత్ లో మొఢేరా అనీ ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించీ మరోసారి చెప్పుకుందాం కానీ , ఇవాళా ఏం చేసినా చెయ్యకపోయినా ఓ సారి ఆదిత్య హృదయం చదవండి.




